4, జూన్ 2019, మంగళవారం

Dr. Vasireddy Sitadevi 2






  

గత యాభై సంవత్సారాల నుంచి సాహిత్య కృషి చేస్తున్న అంధ్రా పెరల్ బక్ డా. వాసిరెడ్డి సీతాదేవి గారితో ఒక వెబ్ సైట్ కోసం తీసుకున్న ఇంటర్వ్యూ....
( ఈ ఇంటర్ వ్యూ 2000 సంవత్సరం లో తీసుకున్నది) 

వాసిరెడ్డి సీతాదేవి గారితో ముఖాముఖి ...
·        మీరు రచనా రంగంలో తిరుగులేని రచయిత్రి. మీ  సాహిత్య రంగ ప్రవేశం ఎప్పుడు జరిగింది? తోలి రచన ఏది?
రచయితల్ని చాలామంది ఇదే ప్రశ్న అడుగుతుంటారు. సమాధానం కూడా వెంటనే చెప్తారు. కాని నా విషయంలో నా తొలి రచన ఎప్పుడు చేసానో నాకే తెలియదు. ఏడేళ్ళ వయసు లేక ఇంకా ముందే చేసి వుంటాను. అతిశయోక్తి కాదు. నా చుట్టూ వున్న జీవితం గురించిన ప్రశ్నలు... సమాధానంలేని ప్రశ్నలు... ప్రశ్నల నించీ ప్రశ్నలు...  నా మనసే కాగితంగా, నా ఆలోచనలే కలంగా రాసాను. నా ఆలోచనలకి అక్షర రూపం కల్పించి పుస్తక రూపంలో  అచ్చయిన తోలి రచన మాత్రం 1950 లో జీవితం అంటే అనే శీర్షిక కింద వెలువడింది. తొలి కధ సాంబయ్య పెళ్ళి 1952 లో రాసాను. 
·        మీ విద్యాబ్యాసం గురించిన  వివరాలు......
నా చదువు గురించి చెబితే పెద్ద కధే అవుతుంది.  మా వూరు చేబ్రోలులో 5 వ తరగతి వరకు చదువు కున్నాను. మా ఊళ్ళో పరదా పద్ధతి వుండేది. 10 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలు చదవ కూడదని నిషేధం వుంది. నాకు చదవాలనే కోరిక, పట్టుదల పరీక్ష రాయాలంటే   రోడ్డుదాటి వెళ్ళాలి. దానికి ఒప్పుకునే వారు కాదు.  మేము చదువుకున్న ఇంట్లోనే పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసి హిందీ పరీక్షలు రాసాను.  మా ఊర్లోనే విశారద పాసయ్యాను. ఆ తరువాత మద్రాసు నగరం చేరి హిందీ ప్రచార సభ వారి పరీక్షలు అన్నీ పాసయి ప్రవీణ, ప్రచారక్ చేసాను. ప్రైవేటుగా నాగపూర్ యునివర్సిటిలో  బి.ఏ. ఎం.ఏ. చదివాను.
·        మీరు రెండు సార్లు డాక్టరేట్ అందుకున్నారు కదా. అవి అందుకుంటున్నపుడు మీ ఫీలింగ్స్ మాతో కూడా పంచుకోండి …..
నేను పొందిన అన్ని అవార్డుల కంటే కూడా ఎంతో సంతోషించాను. ఎందుకంటే నేను కాలేజీలో చదవలేదు. యూనివర్సిటీ మొహం చూడలేదు. అలాంటి నాకు ఒకే సంవత్సరం 1989 లో రెండు విశ్వవిద్యాలయాలు నన్ను గౌరవించి డి.లిట్. పట్టాలు ఇచ్చాయి. శ్రీ పద్మావతీ మహిళా యూనివర్సిటి వారు, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు ఆరునెలల వ్యవధిలో డాక్టరేట్ బిరుడునిచ్చాయి.   ఇది నాకు చాలా అనందాన్నిచ్చింది.. జీవితంలో కొంత సాధించానని అనిపించింది.
·        మీ రచనలు సమాజానికి దగ్గరగా నిజ జీవితానికి ప్రతిబింబంగా వుంటాయి. ఇలా రాయటానికి మీకు ప్రేరణ  ఏమిటి?
చుట్టూ వున్న జీవితాల నుంచి, వాస్తవ ఘటనల్ని బట్టి కధలు అల్లుతాను.
·        మీరు రచనలు చేస్తున్నపుడు కదా వస్తువుని ఎలా ఎంచుకుంటారు. దీనికి ప్రత్యేకమైన విధానాన్ని మీరు అవలంబిస్తారా?
కథ ఎంచుకునే విధానం రెండు రకాలుగా వుంటుంది. జరిగింది చూసి స్పందించి చుట్టూ వున్న సంఘటనలు ఉన్నది ఉన్నట్లుగా రాస్తే అది ఫోటోగ్రఫి అవుతుంది. దానికి కల్పనని జోడించి వాస్తవానికి దగ్గరగా రాస్తే అది క్రియేటివిటీ అవుతుంది. వ్యవస్థని గాని, సమాజంలోని సమస్యలు గాని ఇలా వుండ కుండా మరోలా వుంటే బాగుంటుందని అనుకున్నపుడు ఈ వ్యవస్థలోని లోపాన్ని  తీసుకుని కధ  గాని నవల గాని అల్లుతాను. పాత్రలని సంఘటలని వాస్తవానికి దగ్గరగా అనుకున్న లక్ష్యం వేపు తీసుకెళ్తాను.  సాహిత్యానికి ప్రయోజనం ఉందని నమ్మి రచనలు చేయటం నా లక్ష్యం. మంచి కథకి గుర్తింపు ఎప్పుడోస్తుందంటే కథ చదివిన తరువాత పది నిముషాలయినా ప్రతిపాదించిన విషయాన్ని గురించి ఆలోచించినపుడు మంచి కథ అవుతుంది.....
·        రచనా వ్యాసంగాన్ని చేపట్టాలని ప్రేరణ ఎలా కలిగింది.?
సృజనాత్మకత ప్రతిభ వున్న ప్రతి వాళ్ళూ ఊహా లోకంలో విహరిస్తారని అనుకుంటాను. చిన్న తనం నించీ జీవితం ఏమిటి అనే ప్రశ్న నన్ను వేధించేది. చుట్టూ ఉన్నదే జీవితం కాదు. ఎదో వున్నది అని అనిపించేది. ఏదో చెయ్యాలి, ఎదో సాధించాలి అనే, ఒక్కోసారి ఈ జీవితం క్షణకాలం ఎందుకు ఎదో సాధించాలనే పట్టుదల అనీ అనిపించేది. ఈ ఆలోచనా సంఘర్షణలోనే నా రచనలు ప్రారంభం అయ్యాయను కుంటాను.
·        సమత నవలకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది కదూ?
అవును. సమత నవలకి ఉరితాడు నవలకి సాహిత్య అకాడమీ అవార్డులు వచ్చాయి. ఇవి కన్నడం, హిందీ భాషల్లోకి కూడా అనువదించారు.
·        మరీచిక నవలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది కదా దీనిపై మీ అభిప్రాయం...?
1982 లో ఈ నవలని నిషేధించారు. అదే సంవత్సరం ఆ నిషేదాన్ని తొలగించారు.  మాలపల్లి నవల తర్వాత ప్రభుత్వంచే నిషేధించ బడిన పుస్తకం ఇదే
·        రచనల ప్రభావం వ్యక్తులపై ఉంటుందంటారా?
తప్పకుండా వుంటుంది. ఆలోచింప చేసే సాహిత్యం మనిషి ఆలోచనల్ని తప్పకుండా మారుస్తుంది. రత్తమ్మ కష్టాలు నా కధ చదివి అప్పటి హిందీ ప్రచార సభ నిర్వాహకుని భార్య నుద్దేసించి రాసానని నన్ను ఉద్యోగం లోనించి తీసేశారు. అలాగే రాబందులు రామచిలుకలు అనే నవలలో పంచాయతీ రాజ్ వ్యవస్థలో ముఖ్య సేవికలు, గ్రామ సేవికలపై పురుషుల దౌర్జన్యం గురించి రాసాను. అది చదివి రామిరెడ్డి గారని పంచాయితీ ప్రెసిడెంట్ తమ ఉద్యోగానికి రాజేనామా చేశారు. ఒక మంచి రచన ద్వారా ఒకరు మారినా ఆ రాచయితకు అంతకన్నా అనందం మరోకటుండదు.. అలాగే మరీచిక నవల నిషేధించారు నాకు ఉద్యోగంలో రివర్షన్ జరిగింది.


·        రచయిత్రిగా మీపై ఎవరి ప్రేరణ వుంది?
నా చుటూ వున్నా సమాజం పరిస్తుతులే నాకు ప్రేరణ..
·        నేటి సమాజంలోని స్త్రీలకు మీరిచ్చే  సలహాలు?
స్త్రీల హక్కుల కోసం, మానవ హక్కుల కోసం పోరాడే ప్రతి వాళ్ళు స్త్రీ వాదులే. స్త్రీ విముక్తి కూడా సమాజ విముక్తిలో భాగమే. స్త్రీ పురుషులిద్దరూ శ్రమైక  జీవనంలో భాగస్వాములు కావాలి. స్త్రీ    చైతన్య స్థాయి పెరగాలి.
స్త్రీ తన కాళ్ళపై తానూ నిలబడగలగాలి. ఎప్పుడూ ఎవరో ఒకరు అండగా నిలవాలనుకోవటం పిరికితనం. సూటిగా తన గమ్యం వేపు నడిచే వారికి ఏ అవాంతరాలు  వుండవు. ధైర్యంగా నిలబడితే వెంటపడే వాళ్ళు వెన్నంటి నిలిచే వాళ్ళవుతారు. సూటిగా వెళ్తున్నపుడు ఎవరికీ భయపడాల్సిన పని లేదు. ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారని  ఆలోచిస్తేనే సమస్యలు వస్తాయి. భర్తల ఆరళ్ళు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడే చదువుకున్న స్త్రీలు, ఉద్యోగినిలు కూడా వున్నారు. కొంత కాలం క్రితం ఒక లేడీ డాక్టర్  ఇద్దరు పిల్లల తల్లి, భర్త పెట్టె హింసలు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఇటువంటి వారిపై నాకు సానుభూతి కలగదు. వ్యష్టిగా సమిష్టిగా స్త్రీలు పోరాటం చేస్తున్న ఈ రోజుల్లో కూడా తాళి అనే బ్రహ్మ పదార్ధం చుట్టూ ఈ వ్యవస్థ అల్లిన భావ జాలం నుంచీ చదువుకున్న స్త్రీలు బయట పడలేక పోతున్నారంటే నాకు అంతులేని కోపం వస్తుంది. బాధలతో దద్దమ్మలా బతుకుతున్నారంటే చెంపలు వాయించి ధైర్య చెప్పాలనిపిస్తుంది.
        ఆత్మ విశ్వాసంతో, ధైర్యంతో, ఒక లక్ష్యంతో ముందుకు సాగి పోయే స్త్రీని సమాజం కాని  ఈ పురుషాధిక్యం కానీ ఏమీ చేయదు. చేయలేదు. అందుకు నేనే ఉదాహరణ.

·        తెలుగు సాహిత్యంలో ప్రస్తుతం   అనువాదకులు కూడా ఎక్కువగా వున్నారనే అభిప్రాయం వుంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?

చాలామంది స్వతహాగా రాసేవారూ  వున్నారు. అయినా అనువాదకులు ఇంకా రావాలి. ఇతర భాషల్లో ఆయా రచయితలూ రాసింది ప్రపంచమంతా అందరికీ తెలియాలంటే తప్పకుండా వుండాలి. అప్పుడే మహా మహా రచయితలు రాసింది రచయితల భావాలు అందరికీ తెలిసే వీలుంటుంది.

·        మీ రచనలు ఇంతవరకు ఏఏ  సినిమాలుగా వచ్చాయి? టి.వి. సీరియల్స్ వచ్చాయి?
సమత నవల ప్రజానాయకుడిగా, ప్రతీకారం మనస్సాక్షిగా, మానిని మనసు  ఆమె కధగా మృగతృష్ట అదే పేరుతోనూ వచ్చాయి. ఆమె కధ ఎన్నో అవార్డులు తెచ్చుకుంది.
నా నవలలు ఇదీ కధ,  నిశాగీతం కలిసి ప్రస్తుతం మానస అనే టివి సీరియల్ దూరదర్శన్ లో వస్తోంది. ఇది ఒక సైకలాజికల్ ప్రోబ్లమ్స్ ఆధార పది వున్న సీరియల్. సామాన్యంగా మనకి భౌతిక పరమైన సమస్యలు వస్తే డాక్టరు దగ్గరికి వెళ్తాం. కాని మానసికంగా సమస్య వస్తే డాక్టరు దగ్గరికి వెళ్ళటానికి భయపడం. అదే అమెరకా నంటి దేశాల్లో కొంచెం అనారోగ్యంగా కన్పించినా సైక్రియాట్రిస్ట్ దగ్గరకి వెళ్ళటం, కౌన్సిలింగ్ కి వెళ్ళటం చేస్తుంటారు. ఇక్కడి వాళ్ళు వెళ్లరు. నేను సొంతంగా చాలా సైకలాజికల్ కేసులు డీల్ చేసాను. నా స్నేహితురాలు మంచి సైక్రియాట్రిస్ట్. రోజూ ఆమె దగ్గరికి వెళ్లి ఆమె దగ్గరికి వచ్చే కేసులు గమనించే దాన్ని. మళ్ళీ తెల్లవారింది సీరియల్ కి ఉత్తమ రచయిత్రిగా నంది అవార్డు 1998లో వచ్చింది.
·        నేటి టి.వి. కార్యక్రమాలపై సినిమాలపై మీ అభిప్రాయం?
నేటి సినిమాలు చూడ్డం లేదు. టివి సీరియల్స్ రొటీన్గా వుంటున్నాయి. ఒకటి రెండు సంవత్సరాలు లాగుతూ ఎం చెప్పదలచుకున్నారో తెలీకుండా తీస్తున్నారు. సీరియల్స్ అయిపోతున్న తరుణంలో ఎక్స్టెన్షన్ అవుతున్నాయి.  ఎందుకిస్తున్నారో తెలీదు. దుష్ట పాత్రలు ఎక్కువైనాయి. క్రూరమైన ఆడవాళ్ళు, వెన్నుముక లేకుండా భోరున ఏడ్చే ఆడవాళ్ళని చూపిస్తున్నారు. సహజ పాత్రలు వుండటంలేదు. డైలీ సీరియల్స్ 60 నెలల కంటే ఎక్కువ కాలం వుంటున్నాయి.     
·        మీరు సామాజిక స్పృహ కలిగిన రచనలు ఎక్కువ చేసారు.  దీనికి కారణం ఏదైనా వుందా?  
నా ఆవేశాలకి, ఆలోచనలకి వేదికగా నవల ప్రక్రియనెన్నుకున్నాను.
వాస్తవాన్ని ఇష్టపడే నేను ప్రేమకధలకు, కల్పనా సాహిత్యానికీ ముందు నించి దూరం. ఎప్పుడూ కల్పనా లోకంలో విహరించ లేదు. నాకు సామాన్య జీవితమే నవలా ఇతివృత్త మైంది. సాహిత్యం తపస్సులాటిది.   సమాజంలో ఒక మనిషిని ఒక అడుగు ముందుకు నడిపించినా రచయిత జీవితం ధన్యమైనట్లే! రచనలు పా కులలో ఆలోచనలు రేకెత్తించాలి.  మనుషులు మారారంటే  భావాలు మారినట్లే. మారిన మనుషులు సమాజంలోని అవక తవకల్ని నిర్మూలించి సమాజాన్ని సమ సమాజం వైపు నడిపించడానికి ప్రయత్నిస్తారు . 
·        రచయితగానే కాకుండా సెన్సారు బోర్డు మెంబరుగా మీ అనుభవాలు ఏమిటి?
చాలా అనుభవాలున్నాయి. అన్నీ చెబితే పెద్ద గ్రంధమవుతుంది. నేను వెళ్తున్నానంటే భయపడేవారు. ఆ రోజుల్లో నా సహా కమిటీ మెంబర్లు కూడా పెద్ద వాళ్ళే వున్నారు. డి.జి.పి లేటు నారాయణరావుగారు మొదలైన వాళ్ళు ఉన్నారు. అందరం స్త్రిక్ట్ గా కమిటి పరిశీలనకి  వచ్చిన చిత్రాలు చూసేవాళ్ళం. రూల్స్ ఖచ్చితంగా పాటించే వాళ్ళం. తోలి సెన్సారు బోర్డు మాదే! నేను 1985  నుంచి 1991 వరకూ బోర్డు మెంబరుగా వున్నాను.
·        నూతన రచయితలకి మీరిచ్చే సలహాలు సూచనలు.
రచయితలు తెలిసిన విషయాలనే రాయాలి. అభూత కల్పనలు రాయకూడదు. లక్ష్యం లేని రచనలు చేయద్దు.   మంచి సాహిత్యం చదివి రాయాలి.  చెడు సాహిత్యం మాత్రం చేయకూడదు.  మంచి కన్నా చెడు ప్రభావం ఎక్కువ వుంటుంది.    యువత కెరీర్ ఓరియెంటెడ్  అయిపోయి పుస్తకాలకి దూరం అవుతున్నారు.  ఒక గంట అయినా పుస్తకాలు చదవాలి.  వ్యక్తి తన దైనందిన జీవితానికి దూరం అవుతున్నాడు.  నేటి స్త్రీలలో ఆత్మా విశ్వాసం లోపిస్తోంది.  తల్లి తండ్రి కష్టపడి చదివించినా... లాయర్లు, డాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. స్త్రీలు తమ ఇండివిడ్యుయాలిటి  పెంచుకోవాలి.
·        ప్రస్తుత మీ  రచనలు వాటి గురించి....
కేంద్ర ప్రభుత్వం వారి హ్యూమన్ రిసోర్స్ సీనియర్ ఫెల్లోషిప్ రెండు సంవత్సరాల కాల పరిధిలో చేస్తున్నాను. ఒక నవలని స్త్రీ విముక్తి అనే పేరుతొ రాస్తున్నాను. స్త్రీల హక్కులు, స్త్రీ స్వాతంత్ర్యం గురించి ఇందులో వివరిస్తున్నాను. ...
( ఈ ఇంటర్ వ్యూ 2000) సంవత్సరం లో తీసుకున్నప్పటిది
 (She Died   – 2007)
 


3, జూన్ 2019, సోమవారం

ఉసిరి కాయ పచ్చడి (ఊరగాయ)


ఉసిరి కాయ పచ్చడి (ఊరగాయ)
(కొలతలు ఉజ్జాయింపుగా రాసినవి. ఎవరి రుచులను బట్టి వారు ఉప్పు కారం వేసుకోవచ్చు) ఉసిరికాయ పచ్చడిలో ఉప్పు తక్కువ పడుతుంది.)
ఉసిరికాయలు        :               1   కే.జి.
ఉప్పు                  :               1 చిన్న గ్లాసు లేదా 100 గ్రాములు
కారం                  :               1 చిన్న గ్లాసు లేదా 1 00 గ్రాములు
మెంతి పిండి          :               4  tsp
ఇంగువ               :               1 స్పూన్
తయారీ విధానం    :
ముంగుగా ఉసిరి కాయలు కడిగి శుభ్రంగా తుడిచి తడి లేకుండా ఎండలో ఉంచాలి.
2 .    ఉసిరి కాయలు తరగాలి. గింజలు తీసేయాలి.
3      తరిగిన ఉసిరి కాయ ముక్కలు ఉప్పువేసి దంచాలి. లేదా మిక్సీలో  వేసి మెత్తగా చేయాలి.
4.     దంచిన ఉసిరికాయ లను చేతితో మెత్తగా పిండి రసం ఒక గిన్నెలో, ఉసిరి పొట్టు ను ఇంకో         గిన్నెలో పెట్టాలి.
5.     పసుపు వేసి రసం తీసిన ఉసిరికాయ పొత్తును గిన్నెలో పెట్టి గట్టిగా నొక్కి పెట్టి మూట పెట్టాలి.  రసం ఇంకో గిన్నెలో పెట్టాలి.
6.     మరునాడు సాయంత్రం రసం లో ఉప్పు, కారం, ఇంగువ, మెంతి పిండి (వేయించి పొడి కొట్టినది)ఇంగువ వేసి బాగా కలపాలి. అంతే ఉసిరికాయ పచ్చడి రెడీ 
7.   కొంతమంది  ఉప్పు పసుపు వేసి దంచిన ఉసిరి కాయ పచ్చడిని జాడీలో వుంచి కొద్ది కొద్ది గా తీసుకుని ఎండుమిరపకాయలు పోపు వేసుకుని దంచుకుని చేసే పచ్చడిని చేసుకుంటారు.  
        ఉసిరికాయ పచ్చడి గాలి తగిలితే నల్లగా మారుతుంది. 
       నేను ఈ ఊరగాయను సీసాలో పెట్టి ఫ్రిడ్జ్ లో ఉంచుతాను. అందుకే ఎర్రగా వుంటుంది. 

1, జూన్ 2019, శనివారం

Rasam Powder

 రసం (చారు) పొడి 
ధనియాలు     :   1కప్ 
మిరియాలు     :    1/8 కప్పు 
ఎండుమిరపకాయలు  :   1 కప్పు  
 (1/2 గుంటూరు మిర్చి 1/2 cup 
 బేడిగ మిరపకాయలు, కర్ణాటక మిర్చి  )
జీలకర్ర     :       1/4 కప్
ఇంగువ     :    1 స్పూన్  
కరివేపాకు  :   3 రెమ్మలు 
మెంతులు  : 1 స్పూన్ 
కందిపా\ప్పు : 1/4 కప్పు 
ఆవాలు      : 












తయారు చేయు విధానం :
పైన చెప్పిన వన్నీ విడివిడిగా కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి. 
చల్లారాక మిక్సి లో వేసి పొడి చేసుకోవాలి. 
ఇంకా ఎక్కువ రోజులు రావలి అంటే నూనె లేకుండా పొడిగా వేయించుకోవాలి. 



-- 
mani



4, ఏప్రిల్ 2019, గురువారం

ఉసిరికాయ పచ్చడి (ఊరగాయ)

ఉసిరికాయలు   


ఉసిరి కాయ పచ్చడి (ఊరగాయ)



(కొలతలు ఉజ్జాయింపుగా రాసినవి. ఎవరి రుచులను బట్టి వారు ఉప్పు కారం వేసుకోవచ్చు, ఉసిరికాయ పచ్చడిలో ఉప్పు తక్కువ పడుతుంది.)

కావలసిన పదార్ధాలు:
ఉసిరికాయలు        :               1   కే.జి.
ఉప్పు                 :               1 చిన్న గ్లాసు లేదా 100 గ్రాములు
కారం                  :               1 చిన్న గ్లాసు లేదా 1 00 గ్రాములు
మెంతి పిండి          :               4  tsp
ఇంగువ               :               1 స్పూన్
తయారీ విధానం             :
1.     ముంగుగా ఉసిరి కాయలు కడిగి శుభ్రంగా తుడిచి తడి లేకుండా ఎండలో ఉంచాలి.

2 .    ఉసిరి కాయలు తరగాలి. గింజలు తీసేయాలి.

3      తరిగిన ఉసిరి కాయ ముక్కలు ఉప్పువేసి దంచాలి. లేదా మిక్సీలో  వేసి మెత్తగా              చేయాలి.

4.     దంచిన ఉసిరికాయ లను చేతితో మెత్తగా పిండి రసం ఒక గిన్నెలో, ఉసిరి పొట్టు ను          ఇంకో గిన్నెలో పెట్టాలి.

5.     పసుపు వేసి రసం తీసిన ఉసిరికాయ పొత్తును గిన్నెలో పెట్టి గట్టిగా నొక్కి పెట్టి                మూట పెట్టాలి.  రసం ఇంకో గిన్నెలో పెట్టాలి.'
6.     మరునాడు సాయంత్రం రసం లో ఉప్పు, కారం, ఇంగువ, మెంతి పిండి (వేయించి            పొడి కొట్టినది)ఇంగువ వేసి బాగా కలపాలి.
7.     ఈ రసంలో అన్నీ వేసి బాగా కలిపాక వేరే గిన్నెలో పెట్టిన ఉసిరి కాయలను కూడా           బాగా వేసి కలపాలి.  రెండో రోజుకి ఈ ఉసిరి కాయ పొట్టు బాగా మెత్తగా వుంటుంది .         కాబట్టి మిక్సీలో వేసి మళ్ళీ రుబ్బనక్కర లేదు.

8.     ఈ పచ్చడి జాడీలో పెట్టి వుంచుకుంటే ఏడాది నిలవ వుంటుంది.


రెందవ పద్ధతి 

    :
కారం కలపకుండా ఉప్పు ఒకటే కలిపి ఉంచితే అది ఉప్పు ఉసిరి కాయ అంటాము.  తినాలి అనుకున్నాప్పుడు ఎండుమిరపకాయలు,  మినప్పప్పు, శనగపప్పు, మెంతిపిండి, ఇంగువ వేసి మిక్సీలో వేసి కొద్దిగా ఈ ఉప్పు ఉసిరికాయ పచ్చడి వేసి నూరుకుంటే ఘుమ ఘుమ లాడే ఉసిరికాయ పచ్చడి రెడీ.
ఈ ఊరగాయ  మా ఇంట్లో మాఅమ్మ (గుంటూరు) పెట్టె   పద్దతి.  ఇది ఏడాది నిలవ వుంటుంది.
చాలా మంది అందరూ ఉసిరి కాయలు కాయలు ఊరగాయ పెట్టుకుంటారు.

నోట్:   
1.     ఉసిరికాయలు ఒంటికి చాలా మంచిది  కాని గాలి తగిలితే నల్లబడుతుంది. కాబట్టి నేను సీసాలో పెట్టి ఫ్రిజ్ లో పెడతాను. ఏడాది పొడుగునా ఎర్రగానే ఉంటుంది.
2.     కారం ఊరగాయ కారం కలపాలి. అప్పుడే పచ్చడి బాగుంటుంది.
3.     పచ్చడి చాలా స్ట్రాంగ్ కాబట్టి కొద్దిగా పచ్చడి వేడి వేడి అన్నంలో  నెయ్యి వేసు కలుపుకుని తింటే చాలా బాగుంటుంది.
4.    ముందు పావుకిలో పచ్చడి ట్రై చేయండి.  ఆ తరువాత ఎక్కువ పెట్టుకోవచ్చు. 
     అరకిలో ఉసిరికాయలకు  400 గ్రాముల పచ్చడి వచ్చింది





11, మార్చి 2018, ఆదివారం

సాంబార్ పౌడర్

Sambar Powder
(Kannada Receipe 1)  .
సాంబార్ పొడి :
1.     ధనియాలు           : 2 కప్పులు
2.     మినప్పప్పు : 1 కప్పు
3.     శనగపప్పు    : 1 కప్పు
4.     ఎండుకొబ్బరి       :  1 ½ కప్పు
5.     ఎండు మిరపకాయలు ;  2కప్పులు
6.     ఇంగువ               :   ¼ స్పూన్    
7.     మెంతులు            :   1  tsp
(మసాలా ఇష్టపడే వారు 2” దాల్చిన చెక్క, 10 మిరియాలు  వేసుకోవచ్చు)
తయారు చేసే పధ్ధతి.:
1.     బాళీలో కొద్దిగా నూనె వేసి శనగ పప్పు, మినపప్పు వేసి వేయించుకొని పళ్ళెంలోకి తీసుకోవాలి.
2.     ఆ తరువాత ధనియాలు,   మెంతులు వేయించుకోవాలి.
3.     నూనెలో ఎండు మిరపకాయలు విడిగా వేయించుకోవాలి. చివరగా ఎండు కొబ్బరి తురుము వేయించు కోవాలి.
4.     అన్నీ చల్లారాక మిక్సీ వేసి పొడి చేయాలి.
5.     ఒక డబ్బాలో వేసి నిలవ వుంచుకుని అవసమైనప్పుడు వాడు కోవచ్చు.
Note:
a.     మసాలా ఇష్టపడే వారు 2” దాల్చిన చెక్క, 10 మిరియాలు  వేసుకోవచ్చు

b.     కారం ఎక్కువ కావాలనుకునే వారు మిరపకాయలు ఇంకొక కప్పు వేయచ్చు.
c.      కొబ్బరి వేస్తే సాంబారు మంచి రుచిగా వుంటుంది.
d.     ఇది కన్నడం వాళ్ళు చేసే పద్దతి.
 పైన చెప్పిన కొలతల ప్రకారం చేయచ్చు... లేదా ఉజ్జాయింపుగా కూడా వేసుకోవచ్చు.

  

26, అక్టోబర్ 2017, గురువారం

కథ -

ప్రతి లిపి.కాం లో నా తోలి రచన వచ్చింది. వీలయితే ఓ లుక్ వేయండి .....

చైల్డ్ లేబర్ అంశంగా నేను రాసిన కధ ఇది.


https://telugu.pratilipi.com/read?id=5795543333208064

22, అక్టోబర్ 2017, ఆదివారం

జ్ఞాపకాల జావళి - పొత్తూరి విజయలక్ష్మి

"మధుర జ్ఞాపకాల జావళి -
                       మదిని నింపే మధురానుభూతి!" 
                                                                                                 

                                                             మణినాథ్ కోపల్లె 
            
                ప్రముఖ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి కలం నుంచి వచ్చిన మరో పుస్తకం జ్ఞాపకాల జావళి. ఇందులో వారి శ్రీవారి ఉద్యోగ రీత్యా చిత్తరంజన్ లో గడిపిన అనుభవాలను మన కళ్ళ ముందుంచారు.  ఇందులో   70 వ్యాసాలు  వున్నాయి. ప్రతి జ్ఞాపకమూ వారితో పాటు మనమూ అనుభవిస్తుంటాము.  ఇందులో రోలు నుంచి జాతీయ సమస్యలు, దేశ సరిహద్దుల్లో    యుద్ధాలూ ఇలా ఒకటేమిటి ఎన్నో విషయాలు  తన జ్ఞాపకాలుగా చెప్పారు.  కొన్నిటిలో హాస్యం కూడా ఉంది.   వాక్యాలు కూడా సరళంగా వుండి  తేలిక మాటలతో మనతో మాట్లాడుతున్నట్లే ఉంటాయి.  

                  రైల్వే వారి జీవితాలు ఎలా వుంటాయో చిత్తరంజన్ లో రైలింజన్ల తయారీ, ఆ ఫాక్టరీ విశేషాలు అన్నీ చక్కగా వివరించారు. ఈ పుస్తకం చదివితే రైల్వే ల లో పని చేసే వారి కష్ట సుఖాలు తెలుస్తాయి. చిన్నప్పుడు సోషల్ పుస్తకంలో రైలింజనులు చిత్తరంజన్ లో తయారగును అని ఒక ప్రశ్నకు జవాబుగా చదువుకున్నాం. అంత వరకే తెలుసు చిత్తరంజన్ గురించి.  కాని విజయలక్ష్మి గారి ఈ జ్ఞాపకాల జావళి చదివితే అసలు ఎలా తయావుతాయి రైలింజన్లు, ఆ ఫాక్టరీ, అక్కడి కార్మికులు, ఇలా ఎన్నో విషయాలు మన కళ్ళముందుంటాయి.  

                 మన తెలుగువారి ఆత్మీయతలు పిలుపులు, మన ఆంధ్రాలోనే కాదు  పరాయి రాష్ట్రమైన చిత్తరంజన్ ఎలా ఉంటాయో  తెలిపారు ఆ వూరిలో  తెలుగువారు అనే జ్ఞాపకంలో...  ఆ వూరిలో ముగ్గు ఉంటే, మార్కెట్లో దొండ కాయలు కొంటె తెలుగు వారని ఒకరినొకరు పలకరించు కునే వారుట....  ఎవరికీ ఏ  అవసరం అయినా అందరూ కలిసి కట్టుగా ఉండి సాయం చేసుకుం తారుట.  చేబదుళ్ళు కూడా అవసరాన్ని బట్టి ఒకరికొకరు సాయం చేసుకునే వాళ్ళం అని అంటారు. 

             మేళాలు, జాతరలు జరిగినపుడు వినోదాలు, షాపింగులులే కాదు విందులు కూడా కావాలి.  అక్కడ వున్న నార్త్ ఇండియన్ డిషెస్ తో పాటు మన తెలుగు వారి స్పెషల్ అయిన దోసె అంటే అక్కడి వారికి ఎంత ఇష్టమో ఇందులో తెలియ చేశారు.  70 కిలోల దోశ పిండి   అంటే మాటలా.. అంత పిండి తో దోసెలు వేయటం ,అయినా రద్దీకి తట్టుకోలేక పోవటం, పెద్ద పెద్ద ఆర్డర్ లు, మొహమాటాలు, ఆ రాకాసి అని పేరు పెట్టిన 'దక్షిణ' అనే స్టాల్ ప్రహాసంలో వివరించారు.  ఆ దోసెలను  మనమూ   క్యూ లో నుంచుని తినాలనిపిస్తుంది చదువుతుంటే.... 
              సరదాగా రాసే కబుర్లతో పాటు జాతీయ విపత్తులు గురించి కూడా ప్రస్తావించారు విజయలక్ష్మి గారు.   పాకిస్థాన్ తో 1971 లో జరిగిన యుద్ధం... బంగ్లాదేశ్ ఆవిర్భావం... తో పాటు ఆనాటి యుద్హ పరిస్థితులుచెబుతూ 'యుద్దానంతర వారి వూరిలో ఏర్పడ్డ దుష్పరిణామాలు రెండు మూడేళ్ళ వరకూ వెంటాడాయి' అని అంటారు.  యుద్ధ సమయంలో సరిహద్దు లోనే వున్న చిత్తరంజన్ కు భారీగా వలస వచ్చిన వేలాది మంది తో అతలాకుతలం అయింది ఆ చిన్న వూరు. యుద్ధం ఆగిపోయినా శరణార్థులు తిరిగి వెళ్ళలేదు.  నిరుద్యోగం, ఆకలి కొంత మందిని దొంగలుగా  మార్చింది.  , రైళ్లలోనూ, ఇళ్లలోనూ  విపరీతంగా దొంగ తనాలు జరగటం, నగదుకు, నగలకుసామాన్లకు భద్రతా లేకపోవటం, కాస్త టీ   ఇచ్చినా చాలు ఏదైనా పని చేస్తాం అని ప్రాధేయ పడే వారుట .... ఇలా ఆనాడు జరిగిన పాకిస్థాన్ యుధ్ధ పరిస్థితులు వివరించారు ఈ జ్ఞాపకంలో.... 

             ఇలా ఒకటా రెండా 70 జ్ఞాపకాలను అందించిన ఈ పుస్తకంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు వున్నాయి.  వివాహం అయి శ్రీవారి శివరావు గారి ఉద్యోగ రీత్యా చిత్తరంజన్ లో   గడిపిన వీరి అనుభవాలే ఈ పుస్తకం.  చిన్నప్పుడు రైలు ప్రయాణం చేయాలి అని  ఎంతో సరదా  పడ్డ వీరి జీవితం రైల్వే లో పని చేసే ఇంజనీరు గారితో ముడి పడి ఎన్నో ఎన్నెన్నో అనుభవాలు మనతో కూడా పంచుకున్నారు.  రైల్వే స్టేషన్ ల అభివృద్ధి, నుంచి రైల్వే ల సమ్మె జరిగితే ఎలా ఉంటుందో...  ఆ ఫాక్టరీ లో జరిగే పరిణామాలు మనముందుచారు .... 
            
            శ్రీమతి మీనాక్షి పోన్నుదురై చిత్తరంజన్ వచ్చినపుడు వారి అనుభవాలు .... ఇలాఎన్నో ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి.
             హాస్య చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ వీరి నవల ప్రేమ లేఖ లోని పాత్రల గురించి శ్రీమతి భట్ మరియు చంటి అనే జావళి లో.  . 'ఆవూరు ఆమనుషులు మా  జీవితాల్లో   ఒక భాగం...' అంటారు.  తల్లి చాటు  బిడ్డగా ఆ వూరిలో అడుగు పెట్టిన వీరు వెళ్ళిన కొత్తలో బెంగాలీ భాష రాక పడిన పాట్లు కూడా ఒక జ్ఞాపకం గా వివరించారు ఇందులో.... ఆ తరువాత   బెంగాలీ భాషతో పాటు ఇంగ్లీషు, హిందీ ధారాళంగా మాట్లాడడమే కాదు, ఏ సమస్యనైనా అలవోకగా పరిష్కరించే నేర్పు సంపాదించారు. రైల్వె  వుమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ లో జాయింట్ సెక్రెటరీగా ,  సెక్రటరీ గా ఇలా అనేక పదవులులలో వుండి ఆ ఆర్గనైజేషన్ ద్వారా సమాజానికి ఎన్నో  మంచి పనులు చేసారు.  
     విజయ లక్ష్మి గారు నవ వధువుగా పదిహేడు సంవత్సరాల ప్రాయంలో చిత్తరంజన్ లో అడుగు పెట్టి, అక్కడ  పదిహేడు సంవత్సరాలు అక్కడ గడిపారు.  రైల్వే వారి జీవితం అంటే సుఖాలే కాదు ఎనెన్నో కష్టాలూ వుంటాయని ఈ పుస్తకం ద్వారా మనకి తెలిపారు.          
  ఇంత వరకూ  మంచి పుస్తకం అందించిన పొత్తూరి విజయలక్ష్మి గారి కలం నుంచి మరెన్నో పుస్తకాలు హాస్యంతో పాఠకులను నవ్వుల ఊయలలో ఓలలాడించాలి.   
పుస్తకం పేరు          :     జ్ఞాపకాల జావళి 
రచన                     :     పొత్తూరి విజయ లక్ష్మి 
వెల                        :     150/- రూ.
ప్రచురణ                :      రిషిక పబ్లికేషన్స్ 
పుస్తకం దొరకు చోటు :    అన్ని ప్రముఖ విక్రయ కేంద్రాలు,
                                      శ్రీ రిషిక పబ్లికేషన్స్ 
e-mail                      :      pvlakshmi8@gmail.com 
Ph. No.                    :      040 - 2763 7729