1, అక్టోబర్ 2015, గురువారం

Gandhiji Jayanthi 2 10 2015



జాతి మరువరాని వ్యక్తి మన జాతి పిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.. 




  భారతజాతి ఎల్లప్పుడు తలచుకునే వ్యక్తి జాతిపిత మహాత్మాగాంధీ.  ఈ రోజు ఆయన పుట్టిన రోజు. 1869 లో అక్టోబరులో 2వ తేదీన జన్మించారు. అహింసావాది, సత్యవాది... ఆంగ్లేయులను తరిమి కొట్టటానికి ఆయన ఉపయోగించిన ఆయుధాలు సహాయనిరాకరణ, సత్యాగ్రహం. నిరాడంబరజీవి... బారిష్టర్ చదివి, దేశాభిమానులకు ఆరాధ్యదైవం, దేశాన్ని ఒక్క తాటిన తెచ్చిన వ్యక్తి, ఒక సాధారణ జీవితాన్ని గడుపుతూ, కొల్లాయి గట్టి, చేత కర్రపట్టి, వాడవాడలా పల్లె పల్లె తిరుగుతూ, తన ఉపన్యాసాలతో అందరినీ ఆకట్టుకుంటూ బ్రిటీష్ వారిని కబంధ హస్తాలనుంచి భరతమాత సంకెళ్ళను విడిపించిన వ్యక్తి మహాత్మా గాంధీ....   హరిజనోద్ధరణ, నూలు వడకడం  వంటి సంఘ సంస్కరణలు చేసారు.  
                       బాల్యం :  పోర్ బందర్ లోని  ఒక సామాన్య కుటుంబం లో కరంచంద్ గాంధీ,   పుత్లి బాయి దంపతులకు జన్మించారు గాంధీజీ. 13 ఏళ్లకే కస్తుర్బా తో వివాహం జరిగింది.  . వీరికి నలుగురు పిల్లలు (హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ). ఇంగ్లండ్ లో న్యాయశాస్త్రం చదివారు.  
         

గాంధీజీ ఇంటిలోని ఒక గది


 1891లో అయన తిరిగి వచ్చి న్యాయవాద వృత్తి చేపట్టారు.  1893 లోదక్షిణాఫ్రికా లోని నాటల్‌ లో ఒక న్యాయవాద (లా) కంపెనీలో సంవత్సరము కాంట్రాక్టు లభించింది. అనంతరం 21 సంవత్సరాలు అక్కడే గడిపారు. తెల్లవాడు కాదని మొదటి తరగతి రైలు పెట్టె లోనుంచి వేట్టివేయ బడటం  హోటళ్ళలోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షతలు ఆయనకు సమాజంలోని అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చూపాయి. వాటిని ఎదుర్కోవలసిన బాధ్యతను గ్రహించి, ఎదుర్కొని పోరాడే పటిమను ఆయన నిదానంగా పెంచుకొన్నాడు. గాంధీ నాయకత్వ పటిమ వృద్ధి చెందడానికీ, ఆయన ఆలోచనా సరళి పరిపక్వము కావడానికీ, రాజకీయ విధివిధానాలు రూపు దిద్దుకోవడానికీ  దోహదపడ్డాయి.. ఒక విధముగా భారతదేశం లో నాయకత్వానికి అక్కడే బీజాలు మొలకెత్తాయి. భారతీయుల అభిప్రాయాలను కూడగట్టటమూ, అన్యాయాల పట్ల వారిని జాగరూకులను చేయడమూ ఆయన చేసిన మొదటి పని. 1894 లో భారతీయుల ఓటు హక్కులను కాలరాచే ఒక బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. బిల్లు ఆగలేదుగానీ, ఆయన బాగా జనాదరణ సంపాదించాడు.1914 లో గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చాడు. భారతదేశంలో స్వాతంత్ర్యోద్యమం అప్పుడే చిగురు వేస్తున్నది.1918 లలో చంపారణ్, ఖేడా సత్యాగ్రహాలు నిర్వహించాడు. ప్రజలను చైతన్యవంతులుగా చేయడమూ, చదువునూ సంస్కారాన్నీ పెంచడమూ, జాతి వివక్షతను విడనాడడమూ, అన్యాయాన్ని ఖండించడమూ ఈ సత్యాగ్రహంలో భాగము. ఈ కార్యక్రమంలో ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ గాంధీకి కుడిభుజంగా నిలచాడు.  


           గాంధీ తమ పోరాటంలో మూడుముఖ్యమైన అంశాలను జోడించాడు.
  • "స్వదేశీ" - విదేశీ వస్తువులను బహిష్కరించడం, నూలు వడకడం, ఖద్దరు ధరించడం, విదేశీ విద్యనూ, బ్రిటిష్ సత్కారాలనూ తిరస్కరించడం. వీటివల్ల ఉద్యమంలో క్రమశిక్షణ పెరిగింది. మహిళలు మరింతగా ఉద్యమానికి దగ్గరయ్యారు. దేశ ఆర్ధిక వ్వవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలకు అవకాశం పెరిగింది. ఆత్మాభిమానమూ, ఆత్మ విశ్వాసమూ వెల్లి విరిశాయి. 
  • "సహాయ నిరాకరణ" - ఏదయితే అన్యాయమో దానికి ఏ మాత్రమూ సహకరించకపోవడం. ప్రభుత్వానికి  పన్నులు కట్టరాదు.   చట్టాలను ఆమోదించరాదు.   
"సమాజ దురాచార నిర్మూలన" - గాంధీ దృష్టిలో స్వాతంత్ర్యము అంటే పరిపూర్ణమైన వ్యక్తి వికాసానికి అవకాశం. అంటరానితనమున్నచోట, మురికివాడలున్నచోట, హిందూ ముస్లిములు తగవులాడుకొంటున్నచోట స్వాతంత్ర్య మున్నదనుకోవడంలో అర్ధం లేదు. 


     1946 లో స్పష్టమైన బ్రిటిష్ కాబినెట్ మిషన్ ప్రతిపాదన చర్చకు వచ్చింది. కాని ఈ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితిలోను అంగీకరించవద్దని గాంధీజీ పట్టుపట్టాడు. ముస్లిమ్ మెజారిటీ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలనే ఆలోచన దేశవిభజనకు నాంది అని గాంధీజీ భయము. గాంధీజీ మాటను కాంగ్రెసు త్రోసిపుచ్చిన కొద్ది ఘటనలలో ఇది ఒకటి. కాబినెట్ మిషన్ ప్రతిపాదనను నిరాకరిస్తే అధికారం క్రమంగా ముస్లిమ్ లీగ్ చేతుల్లోకి జారుతుందని నెహ్రూసర్దార్ పటేల్ అభిప్రాయపడ్డారు. 1946-47 సమయంలో 5000 మంది హింసకు ఆహుతి అయ్యారు. హిందువులుముస్లిములుసిక్కులుక్రైస్తవులు ఇరుగు పొరుగులుగా ఉన్న దేశాన్ని మతప్రాతిపదికన విభజింపడాన్ని గాంధీ తీవ్రంగా వ్యతిరేకించాడు. కాని  హిందూ - ముస్లిం కలహాలు ఆపాలంటే దేశవిభజన కంటే గత్యంతరము లేదని తక్కిన కాంగ్రెసు నాయకత్వము అంగీకరించింది .
       భారతీయుల స్వాతంత్య్ర పోరాటాకి తలవొగ్గి బ్రిటిష్ ప్రభుత్వం 1947 ఆగష్టు 15 న స్వతంత్ర భారతావనిని భారతీయులకు అప్పగించింది.  1947 ఆగస్టు 15న దేశమంతా సంబరాలు జరుపుకొంటూ ఉండగా దేశవిభజన వల్ల విషణ్ణుడైన గాంధీమాత్రము కలకత్తా లో ఒక హరిజనవాడను శుభ్రముచేస్తూ గడిపాడు. ఆయన కలలన్నీ కూలిపోయిన సమయంలో హిందూ ముస్లిమ్ మత విద్వేషాలు పెచ్చరిల్లి ఆయనను మరింత శోకానికి గురిచేశాయి.
స్వాతంత్ర్యానంతరం గాంధీ ప్రయత్నాలు హిందూ-ముస్లిం విద్వేషాలను నివారించడానికీ, ఆత్మశోధనకూ పరిమితమయ్యాయి. ప్రభుత్వం పరిస్థితిని అదుపు చేయలేని అసహాయ స్థితిలో పడింది. మొత్తం పోలీసు బలగాలు దేశ పశ్చిమప్రాంతానికి పంపబడ్డాయి. తూర్పు ప్రాంతంలో కల్లోలాలను అదుపు చేసే భారం గాంధీ పై పడింది. దేశవిభజనతో ముఖ్యంగా పంజాబు, బెంగాలు లలో పెద్దఎత్తున సంభవించిన వలసలవల్ల మత కలహాలు, మారణకాండలు ప్రజ్వరిల్లాయి. 1947లో కాశ్మీరు విషయమై భారత్ - పాకిస్తాన్ యుద్ధం తరువాత ఇంటా, బయటా పరిస్థితి మరింత క్షీణించింది. ముస్లిములందరినీ పాకిస్తానుపంపాలనీ, కలసి బ్రతకడం అసాధ్యమనీ వాదనలు నాయకుల స్థాయిలోనే వినిపించసాగాయి. ఈ పరిస్థితి గాంధీకి పిడుగుదెబ్బ వంటిది. దీనికి తోడు విభజన ఒప్పందం ప్రకారము పాకిస్తానుకు ఇవ్వవలసిని 55 కోట్లు రూపాయలను ఇవ్వడానికి భారత్ నిరాకరించింది. ఆ డబ్బు భారతదేశంపై యుద్ధానికి వాడబడుతుందని పటేల్ వంటి నాయకుల అభిప్రాయం. కాని అలా కాకుంటే పాకిస్తాన్ మరింత ఆందోళన చెందుతుందనీ, దేశాలమధ్య విరోధాలు ప్రబలి మతవిద్వేషాలు సరిహద్దులు దాటుతాయనీ, అంతర్యుద్ధానికి దారితీస్తుందనీ గాంధీ అభిప్రాయం. ఈ విషయమై ఆయన ఢిల్లీలో తన చివరి ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. ఆయన డిమాండ్లు రెండు - (1) మత హింస ఆగాలి (2) పాకిస్తానుకు 55 కోట్ల రూపాయలు ఇవ్వాలి. - ఎవరెంతగా ప్రాధేయపడినా ఆయన తన దీక్ష మానలేదు. చివరకు ప్రభుత్వం దిగివచ్చి పాకిస్తానుకు డబ్బు ఇవ్వడానికి అంగీకరించింది. హిందూ, ముస్లిమ్, సిక్కు వర్గాల నాయకులు సఖ్యంగా ఉండటానికి కట్టుబడి ఉన్నామని ఆయనవద్ద ప్రమాణం చేశారు. అప్పుడే ఆయన నిరాహార దీక్ష విరమించాడు. కాని ఈ మొత్తం వ్యవహారంలో గాంధీ పట్ల మతోన్మాదుల ద్వేషం బలపడింది. ఆయన పాకిస్తానుకూ, ముస్లిములకూ వత్తాసు పలుకుతున్నాడని హిందూమతంలోని తీవ్రవాదులూ, హిందువులకోసం ముస్లిము జాతీయతను బలిపెడుతున్నాడని ముస్లిములలోని తీవ్రవాదులూ ఉడికిపోయారు.

గాంధీ హత్య 

1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా ఆయనను నాథూ రామ్ గాడ్సే కాల్చి చంపాడు. నేలకొరుగుతూ గాంధీ "హే రామ్" అన్నాడని చెబుతారు.  1948 జనవరి 30వ తేదీ సాయంత్రం 5:17 గంటలకు మహాత్మాగాంధీ ఢిల్లీలోని బిర్లాహౌస్‌లో ప్రార్థనా సమావేశాన్ని ముగించి బయటకు వస్తున్నప్పుడు నాథూరాంగాడ్సే ఆయనకు ఎదురుగా వచ్చారు. గాడ్సే   సెమి-ఆటోమెటిక్ పిస్టల్‌తో గాంధీ ఛాతిలోకి మూడుసార్లు కాల్చారు. దీంతో బాపూజీ అక్కడికక్కడే కుప్పకూలారు.    గాడ్సే కాల్చిన ఒక బుల్లెట్ గాంధీ ఛాతిలోకి దూసుకొని పోగా మిగిలిన రెండు బుల్లెట్లు పొట్ట నుంచి దూసుకెళ్లాయి.
ఢిల్లీ రాజఘాట్ లో అతని సమాధి మరియు స్మారక స్థలమైన రాజ్ ఘాట్ వద్ద  చెక్కి ఉన్నది. మహాత్ముని మరణాన్ని ప్రకటిస్తూ జవహర్ లాల్ నెహ్రు రేడియోలో అన్న మాటలు: "మిత్రులారా,  జాతిపిత బాపూ ఎప్పటిలాగా మన కంటికి కన్పించడు. మనను ఓదార్చి, దారి చూపే పెద్దదిక్కు మనకు లేకుండా పోయాడు. నాకూ, కోట్లాది దేశప్రజలకూ ఇది తీరని శోకము".


]

                                                             !!హే రామ్ !!

(మేము ఇటీవల పోర్ బందర్ వెళ్ళి,  మహాత్మా గాంధీజి ఇంటిని సందర్శించి నపుడు ఫోటో గాలరి లోనుంచి తీసిన ఫోటోలు )
వ్యాసానికి ఆధారం : వికి పీడియా సౌజన్యం తో 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి