3, అక్టోబర్ 2015, శనివారం

"అమావాస్య చంద్రిక " డా. గురజాడ శోభాపేరిందేవి

నేటి నిజం దినపత్రికలో నేను రాసిన పుస్తక సమీక్ష


పుస్తకం పేరు:    అమావాస్య చంద్రిక
రచయిత్రి         డా. గురజాడ శోభాపేరిందేవి   
పుస్తక సమీక్ష
అమావాస్య చంద్రిక
-మణినాథ్ కోపల్లె
ప్రముఖ రచయిత్రి, సంఘసేవకురాలు డా. గురజాడ శోభాపేరిందేవి రచించిన అమావాస్య చంద్రిక పుస్తకాన్ని  శ్రీశ్రీశ్రీ చిన జియ్యర్ స్వామి వారు    సామాజిక సత్ సాహిత్య స్వరూపం అని అభివర్ణించారు.
ఈ పుస్తకం కిన్నెర వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక కార్యదర్శి శ్రీమతి  కిన్నెర నాగచంద్రిక గారి జీవిత కథ. ఈ పుస్తకంలో నాగ చంద్రిక జీవితంలో అనుభవించిన సుఖదుఖాలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ చాలా హృద్యంగా వివరించారు రచయిత్రి. నాగచంద్రిక జీవితంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగ పడే అంశాలను వివరించారు.  వ్యక్తి జీవితంలో ఎదురయ్యే కష్టాలు,  కన్నీళ్ళు, సమస్యలు   ఎలా ఎదుర్కొని  థృడవంతులుగా, శక్తివంతులుగా మార్చి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపేలా చేస్తాయో చక్కగా చెప్పారు రచయిత్రి.
          చిన్నప్పటి నుంచి గారంబంగా మేనమామ ఇంట పెరిగిన నాగచంద్రిక జీవితంలో వివాహం ఒక పెద్ద మలుపు.. తెలిసీ తెలియని వయసులో  కొత్త పెళ్ళికూతురిగా అడుగుపెట్టిన నాడే ఆమె  భర్త వ్యాధి గ్రస్థుడని  తెలియసినా మనోధైర్యంతో నిలబడిన  అనంతరం ఆమె జీవితంలో ఎదుర్కున్న సమస్యలు  ఆమెని జీవితంలో రాయిని చేసి సమాజ సేవకై అంకితం చేసేలా చేశాయి.
 ఆచార విరుద్ధం అని అందరూ ముక్కున వేలేసుకున్నా నాగచంద్రిక తల్లికి తనే కర్మ కాండలు జరపడం ఆమె లోని ధృడ సంకల్పం చెబుతుంది.  తనకి చెడు చేసిన వారిని కూడా  ఆమె క్షమించింది.  ఆశ్రమంలో అవసాన దశలో ఉండే వృద్ధులకి సపరిచర్యలు చేస్తూ, వారి మరణానంతరం అంతిమ సంస్కారాలు చేయించేవారు నాగచంద్రిక. మానవసేవే మాధవసేవ అని నిరూపిస్తూ నలుగురికీ మార్గదర్శకంగా నిలిచారు.  
          నాగచంద్రిక జీవిత చరిత్రని అందరిలో మనో ధైర్యాన్ని పెంచేలా వ్యక్తిత్వ వికాసానికి దోహద పడేలా రచయిత్రి వివరించారు.  పెరిగిపోతున్న వృద్ధుల నిరాదరణ గురించి చెబుతూ  ఇంట్లో వృద్ధులని గౌరవించాలని, అది పిల్లల బాధ్యతని, పగ, ద్వేషం మనిషి పతనానికి దారితీస్తుందని చెబుతారు. 
ఈ పుస్తకంలో రచయిత్రి వృద్ధాశ్రమాలలోని వ్యక్తుల మానసిక పరివర్తన ఏలా ఉంటుందో, ఎలాటి వ్యక్తులు వుంటారో చక్కగా వివరించారు.
  ఒక వృద్ధాశ్రమాన్ని నిర్వహించడంలో ఎన్నో సమస్యలెదురవుతాయి. అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కున్నారు నాగచంద్రిక. ఈ పుస్తక ఒక నవలలా సాగిపోతుంది తప్ప బయగ్రఫీ పుస్తకం అనిపించదు చదువుతుంటే.... జీవితంలో ఎదురయ్యే చీకట్లను తిడుతూ కూర్చోకుండా చీకట్లు పారద్రోలే శక్తి స్త్రీ కి వుందని నిరూపిస్తుంది. అత్యధిక స్త్రీల మరణాలలో ఆత్మహత్య చేసుకునే వారే ఎక్కువగా నమోదవుతున్నాయనే వివరాలు,  ఆత్మహత్య కారణాలు... అన్నీ వివరంగా  ఈ పుస్తకంలో రచయిత్రి తెలిపారు. 
నాగచంద్రిక ఉద్యోగ పర్వంలో ఆమెకి అభినవ కీచకులు, అభయహస్తం అందించే స్నేహశీలురూ ఎదురయ్యారు.  డబ్బే పరమార్ధంగా   జీవించే వారింటకూడా ఆమె మనోధైర్యంగా నిలబడింది. ఎంత డబ్బున్నా ఆకలి తీర్చేది అన్నమే కాని కాసులు కావని అర్ధం చేసుకోని వ్యక్తుల మధ్య  జీవించింది నాగచంద్రిక. వివాహబంధం గురించి రచయిత్రి చక్కగా వివరించారు.
 కిన్నెర వెల్ఫేర్ సొసైటీని గత 12 సంవత్సరములుగా నిర్వఘ్నంగా నడుపుతున్న  నాగచంద్రిక  పలు రాష్ట్రీయ, జాతీయ అవార్డులు అందుకున్నారు. పలువురి ప్రశంసలు అందుకున్నారు.
రచయిత్రి డా.గురజాడ శోభాపేరిందేవి రచించిన ఆటో బయోగ్రఫీలలో ఇది మూడవ పుస్తకం. తొలుత స్వాతంత్ర్య వీరుడు కా నా, ఆమె ఓటమినోడించింది, మూడు అమావాస్య చంద్రిక. ఇంకా మరో రెండు మూడు బయోగ్రఫీ పుస్తకాలు త్వరలో రాబోతున్నాయి....
  

-మణినాథ్ కోపల్లె
9703044410




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి