4, ఫిబ్రవరి 2016, గురువారం

దీప తోరణం - కన్నెగంటి పుస్తక sameeksha

పుస్తక సమీక్ష:
దీపతోరణం
-మణినాథ్ కోపల్లె
ప్రముఖ రచయిత్రి  కన్నెగంటి అనసూయ  రచించిన దీపతోరణం పుస్తకం ఇటీవల లేఖిని సంస్థ అధ్వర్యంలో  ప్రముఖ రచయిత్రుల నడుమ ఆవిష్కరించబడింది.
ఈ దీపతోరణం పుస్తకంలో 15 కథలు వున్నాయి. ఈ కధలన్నీ ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి. తన జీవితంలో  ఎదురయ్యే సంఘటనలే కథలుగా మలిచానని అంటారు రచయిత్రి. సాధారణ వ్యక్తులు, సాధారణ విషయాలు, సాధారణ సంఘటనలు వీరి కథాంశాలు.  తండ్రి ప్రేమ కోసం ఆరాట పడే వ్యక్తి వ్యధ పితృదేవోభవ కథలో కనిపిస్తుంది. తండ్రి భుజాలమీద ఎక్కాలనే చిన్న ఆనందం, చెరకుగడలు నాన్నే ముక్కలు చేసి ఇవ్వాలి అనే  కోరిక తీరలేదనేస్వల్ప విషయాలు తండ్రిపై ద్వేషం పెంచుకునేలా చేస్తాయి.   తన బదులు మోతుబరి రైతన్న కొడుకు వంశీకి తన తండ్రి సేవలందించటం  భరించలేకపోతాడు కృష్ణ. చివరికి పట్టుదలతో గురువుగారి బోధనలతో ఆ కసిని చదువు మీద పెట్టి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవటం ఈకథ  చెబుతుంది.     
మరోకథ జీవితాన్ని శాసించేవి కథలో నేడు సమాజంలో దాదాపు చాలా కుటుంబాలు ఎదుర్కుంటున్న సమస్యలే. చిన్న ఇంటిలో ఉన్న సుఖం పెద్ద ఇంటిలో ఏమి కోల్పోతామో చెబుతుంది. కొత్త ఇల్లు, పెద్ద ఇల్లు మనిషికో గది  పేరిట పిల్లలు ఆత్మీయతానురాగాలు కోల్పోయి తమ తమ ప్రపంచంలో మునిగిపోయి ప్రవర్తించే తీరు, ఇల్లు విశాలమయితే మనసులు ఇరుకు లాగా తయారయి చివరికి మళ్ళీ పాత చిన్న ఇంటికి మారిపోవాలని నిర్ణయించుకోవటం కథకి ముగింపునిస్తారు రచయిత్రి.
ఆమాత్రం చాలు కథలో సాధారణంగా గృహిణులు ఏదైనా వస్తువు కొనేటప్పుడు తీసుకోవాల్సిన విషయాలు చెబుతుంది. మా దగ్గర ఈ వస్తువు తక్కువ అని షాపు వాళ్ళు చెప్పే మోజులో అసలు బిల్ తీసుకోకుండా కాగితం మీద ఇచ్చి న బీల్ తీసుకోవటం , కొన్న వస్తువులు త్వరగా పాడయిపోవడం, వంటి అనుభవాలు చాలామందికి అనుభవమే.
ఎవరు మురికి ఏది మురికి కథలో అంటరాని వాళ్ళు అని వేరుగా చూసే వ్యక్తుల రక్తమే అవసరానికి రక్తం ఎక్కించినపుడు ఈ ప్రశ్న ఉదయిస్తుంది. మనుషులంతా ఒకటే... ఎవరూ ఎక్కువా తక్కువా కాదు అనే పాఠం చెబుతుంది ఈ కథాంశం.
అమ్ముమ్మ కానుక కథలో తన మనవరాలి కి ఇవ్వబోయే కానుక కోసం దాచిన డబ్బుని ఆమె ప్రామిసరీ నోట్లు రాసే   కాలం గడిపిన దశరధరామయ్య తాత మనవరాలికి కానుకగా ఇవ్వడం ... అలాగే ఉచితంగా ఇచ్చే గొడుగులు వద్దని విద్యార్థులంతా వెళ్ళిపోయినా బూశమ్మ ఒక్కతే ఉచితంగా ఇచ్చే ఆ గొడుగు కోసం ఎదురు చూడ్డం, దానికి కారణాలు ఆ చల్లని నీడ కథలో చెబుతాయి... ఙ్ఞాపకం జీవించిన వేళ కథలో మనిషి ఙ్ఞాపకాలు చిన్ననాడు సీతాపలపళ్ళు అమ్మే తాతని, అమ్మాయిగారిని కలపటం తో ముగుస్తుంది.
 ఇలా ప్రతి ఒక్క కథా సామాజిక అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రాసిందే... ఇంకా ఎన్నో కథలున్నాయి.
కన్నెగంటి పుట్టిన పశివేదల గ్రామ పరిసరాలు, ఆత్మీయతానురాగాలు, పల్లె వాతావరణం,  ఇవన్నీ ఆమె కథలలో తొంగి చూస్తాయి.  కన్నెగంటి అనసూయ మూడవ కథల సంపుటి ఈ పుస్తకం. రచయిత్రి గానే కాదు స్వచ్ఛంద సంస్థని స్థాపించి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో పేరు సంపాదించుకున్నారు,   సమాజ సేవ చేస్తున్న రచయిత్రి కథలని విశిష్ఠ రచనలు, హృదయానికి హత్తుకునేవి అని ప్రముఖ రచయిత మునిపల్లె రాజుగారు అభివర్ణించారు.

    “దీపతోరణం  కథానికలు
రచన  : కన్నెగంటి అనసూయ
పేజీలు  :   177        ధర  : 120/-
For Copies :    Kanneganti Anasuya
406, Vindhya 4
Kukatpally ‘Y’ Junction,
Jaya Bharathi Gardens, Kukatpally, Hyderabad 18



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి