గోదావరి పుష్కరాలు-విజ్జేశ్వరం
పుష్కరాలు ఈ 20సంవత్సరం ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి. ప్రజలందరిలో చైతన్యం వచ్చింది. పుష్కర స్నానమాచరించి పుణ్యం సంపాదించుకోవాలని, దానాలు, పిండప్రదానాలు చేయాలని, అందరికీ విపరీతంగా ప్రచారం చేసిన మీడియా వల్ల ఙ్ఞానం వచ్చింది.
ఈసారి వచ్చిన గోదావరి పుష్కరాలు ప్రతి పుష్కరాలకి వెళ్ళినట్లే గోదావరితీరాన వెలసిన విజ్జేశ్వరం గ్రామానికి వెళ్ళాము. రాజమండ్రి, ధవళేశ్వరానికి, నిడదవోలుకి మధ్యన వున్న ఈ విజ్జేశ్వరం చారిత్రాత్మకత ఉన్న ఊరు. ఒ యన్ జి.సి, గాస్ ప్లాంట్ లు ఉన్న ఊరు అవటంతో ఆ వూరు గురించి మరింత పేరు పొందింది.
ఆ వూరిలో యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయం, వశిష్ఠ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, శివాలయం పురాతనమైనవి. ఇంకా ఆధునికంగా నిర్మించిన రామాలయం, లైబ్రరీ కూడా వున్నాయి.
అర్జునుడు స్థాపించిన శివలింగం పేరుతో విజయుడు పేరుతో విజయేశ్వరం రాను రాను విజ్జేశ్వరంగా మారింది. ఇక్కడ ఆలయం తవ్వకాలలో దొరికిన శిలాశాసనాలనిబట్టి ఈ కథ ప్రచారంలో వుంది.
చక్కని ప్రకృతి అందాల నడుమ వశిష్ఠగోదావరి పుష్కర ఘాట్ లో ఈసారి మేము మునకలేశాం. పుష్కర ఘాట్లో కొత్తగా నిర్మంచిన వినాయకుడి మందిరం... రోజూ సాయంత్రం గోదావరి హారతి, ఉదయం ఆలయం నుంచి వినిపించే వేదమంత్రాలు, పెద్దలకు అర్పించే తర్పణాలు, పిండప్రదానాలు, నడుమ పిన్నా పెద్దా అంతా గోదావరిలో స్నానాలు.... ప్రసాద వితరణలు, ప్రత్యేక అతిధిగా ఆ గ్రామానికి కాశీ నుంచి విచ్చేసిన స్వామీజీ చే శాస్త్రోక్తంగా ఆగోదావరి తల్లికి హారతులు .. చూస్తుంటే ఆ గ్రామమంతా పండగ వాతావరణం నెలకొంది.
విజ్జేశ్వరం చిన్న గ్రామం కావడంతో రద్దీ ఎక్కువ లేదు. పైగా నిడదవోలు రాజమండ్రి మధ్య వున్న రోడ్డుకి ఒక కిలోమీటరు వెడితే కాని వూరు రాదు. అందుకే ఇక్కడ స్నానఘట్టం వుందని చాలామందికి తెలీదు. ఆవూరిలో వుండే వారి బంధువులు, స్నేహితులు మొదలైన వారు తప్ప బయటివారు చాలా తక్కువ.... ఈ పుష్కరం రోజులన్నీ అందరి ఇళ్ళూ బంధువుల రాకపోకలతో కళకళలాడుతూ ఉన్నాయి .....
కోనసీమ అందాలు ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి