26, అక్టోబర్ 2017, గురువారం

కథ -

ప్రతి లిపి.కాం లో నా తోలి రచన వచ్చింది. వీలయితే ఓ లుక్ వేయండి .....

చైల్డ్ లేబర్ అంశంగా నేను రాసిన కధ ఇది.


https://telugu.pratilipi.com/read?id=5795543333208064

22, అక్టోబర్ 2017, ఆదివారం

జ్ఞాపకాల జావళి - పొత్తూరి విజయలక్ష్మి

"మధుర జ్ఞాపకాల జావళి -
                       మదిని నింపే మధురానుభూతి!" 
                                                                                                 

                                                             మణినాథ్ కోపల్లె 
            
                ప్రముఖ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి కలం నుంచి వచ్చిన మరో పుస్తకం జ్ఞాపకాల జావళి. ఇందులో వారి శ్రీవారి ఉద్యోగ రీత్యా చిత్తరంజన్ లో గడిపిన అనుభవాలను మన కళ్ళ ముందుంచారు.  ఇందులో   70 వ్యాసాలు  వున్నాయి. ప్రతి జ్ఞాపకమూ వారితో పాటు మనమూ అనుభవిస్తుంటాము.  ఇందులో రోలు నుంచి జాతీయ సమస్యలు, దేశ సరిహద్దుల్లో    యుద్ధాలూ ఇలా ఒకటేమిటి ఎన్నో విషయాలు  తన జ్ఞాపకాలుగా చెప్పారు.  కొన్నిటిలో హాస్యం కూడా ఉంది.   వాక్యాలు కూడా సరళంగా వుండి  తేలిక మాటలతో మనతో మాట్లాడుతున్నట్లే ఉంటాయి.  

                  రైల్వే వారి జీవితాలు ఎలా వుంటాయో చిత్తరంజన్ లో రైలింజన్ల తయారీ, ఆ ఫాక్టరీ విశేషాలు అన్నీ చక్కగా వివరించారు. ఈ పుస్తకం చదివితే రైల్వే ల లో పని చేసే వారి కష్ట సుఖాలు తెలుస్తాయి. చిన్నప్పుడు సోషల్ పుస్తకంలో రైలింజనులు చిత్తరంజన్ లో తయారగును అని ఒక ప్రశ్నకు జవాబుగా చదువుకున్నాం. అంత వరకే తెలుసు చిత్తరంజన్ గురించి.  కాని విజయలక్ష్మి గారి ఈ జ్ఞాపకాల జావళి చదివితే అసలు ఎలా తయావుతాయి రైలింజన్లు, ఆ ఫాక్టరీ, అక్కడి కార్మికులు, ఇలా ఎన్నో విషయాలు మన కళ్ళముందుంటాయి.  

                 మన తెలుగువారి ఆత్మీయతలు పిలుపులు, మన ఆంధ్రాలోనే కాదు  పరాయి రాష్ట్రమైన చిత్తరంజన్ ఎలా ఉంటాయో  తెలిపారు ఆ వూరిలో  తెలుగువారు అనే జ్ఞాపకంలో...  ఆ వూరిలో ముగ్గు ఉంటే, మార్కెట్లో దొండ కాయలు కొంటె తెలుగు వారని ఒకరినొకరు పలకరించు కునే వారుట....  ఎవరికీ ఏ  అవసరం అయినా అందరూ కలిసి కట్టుగా ఉండి సాయం చేసుకుం తారుట.  చేబదుళ్ళు కూడా అవసరాన్ని బట్టి ఒకరికొకరు సాయం చేసుకునే వాళ్ళం అని అంటారు. 

             మేళాలు, జాతరలు జరిగినపుడు వినోదాలు, షాపింగులులే కాదు విందులు కూడా కావాలి.  అక్కడ వున్న నార్త్ ఇండియన్ డిషెస్ తో పాటు మన తెలుగు వారి స్పెషల్ అయిన దోసె అంటే అక్కడి వారికి ఎంత ఇష్టమో ఇందులో తెలియ చేశారు.  70 కిలోల దోశ పిండి   అంటే మాటలా.. అంత పిండి తో దోసెలు వేయటం ,అయినా రద్దీకి తట్టుకోలేక పోవటం, పెద్ద పెద్ద ఆర్డర్ లు, మొహమాటాలు, ఆ రాకాసి అని పేరు పెట్టిన 'దక్షిణ' అనే స్టాల్ ప్రహాసంలో వివరించారు.  ఆ దోసెలను  మనమూ   క్యూ లో నుంచుని తినాలనిపిస్తుంది చదువుతుంటే.... 
              సరదాగా రాసే కబుర్లతో పాటు జాతీయ విపత్తులు గురించి కూడా ప్రస్తావించారు విజయలక్ష్మి గారు.   పాకిస్థాన్ తో 1971 లో జరిగిన యుద్ధం... బంగ్లాదేశ్ ఆవిర్భావం... తో పాటు ఆనాటి యుద్హ పరిస్థితులుచెబుతూ 'యుద్దానంతర వారి వూరిలో ఏర్పడ్డ దుష్పరిణామాలు రెండు మూడేళ్ళ వరకూ వెంటాడాయి' అని అంటారు.  యుద్ధ సమయంలో సరిహద్దు లోనే వున్న చిత్తరంజన్ కు భారీగా వలస వచ్చిన వేలాది మంది తో అతలాకుతలం అయింది ఆ చిన్న వూరు. యుద్ధం ఆగిపోయినా శరణార్థులు తిరిగి వెళ్ళలేదు.  నిరుద్యోగం, ఆకలి కొంత మందిని దొంగలుగా  మార్చింది.  , రైళ్లలోనూ, ఇళ్లలోనూ  విపరీతంగా దొంగ తనాలు జరగటం, నగదుకు, నగలకుసామాన్లకు భద్రతా లేకపోవటం, కాస్త టీ   ఇచ్చినా చాలు ఏదైనా పని చేస్తాం అని ప్రాధేయ పడే వారుట .... ఇలా ఆనాడు జరిగిన పాకిస్థాన్ యుధ్ధ పరిస్థితులు వివరించారు ఈ జ్ఞాపకంలో.... 

             ఇలా ఒకటా రెండా 70 జ్ఞాపకాలను అందించిన ఈ పుస్తకంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు వున్నాయి.  వివాహం అయి శ్రీవారి శివరావు గారి ఉద్యోగ రీత్యా చిత్తరంజన్ లో   గడిపిన వీరి అనుభవాలే ఈ పుస్తకం.  చిన్నప్పుడు రైలు ప్రయాణం చేయాలి అని  ఎంతో సరదా  పడ్డ వీరి జీవితం రైల్వే లో పని చేసే ఇంజనీరు గారితో ముడి పడి ఎన్నో ఎన్నెన్నో అనుభవాలు మనతో కూడా పంచుకున్నారు.  రైల్వే స్టేషన్ ల అభివృద్ధి, నుంచి రైల్వే ల సమ్మె జరిగితే ఎలా ఉంటుందో...  ఆ ఫాక్టరీ లో జరిగే పరిణామాలు మనముందుచారు .... 
            
            శ్రీమతి మీనాక్షి పోన్నుదురై చిత్తరంజన్ వచ్చినపుడు వారి అనుభవాలు .... ఇలాఎన్నో ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి.
             హాస్య చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ వీరి నవల ప్రేమ లేఖ లోని పాత్రల గురించి శ్రీమతి భట్ మరియు చంటి అనే జావళి లో.  . 'ఆవూరు ఆమనుషులు మా  జీవితాల్లో   ఒక భాగం...' అంటారు.  తల్లి చాటు  బిడ్డగా ఆ వూరిలో అడుగు పెట్టిన వీరు వెళ్ళిన కొత్తలో బెంగాలీ భాష రాక పడిన పాట్లు కూడా ఒక జ్ఞాపకం గా వివరించారు ఇందులో.... ఆ తరువాత   బెంగాలీ భాషతో పాటు ఇంగ్లీషు, హిందీ ధారాళంగా మాట్లాడడమే కాదు, ఏ సమస్యనైనా అలవోకగా పరిష్కరించే నేర్పు సంపాదించారు. రైల్వె  వుమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ లో జాయింట్ సెక్రెటరీగా ,  సెక్రటరీ గా ఇలా అనేక పదవులులలో వుండి ఆ ఆర్గనైజేషన్ ద్వారా సమాజానికి ఎన్నో  మంచి పనులు చేసారు.  
     విజయ లక్ష్మి గారు నవ వధువుగా పదిహేడు సంవత్సరాల ప్రాయంలో చిత్తరంజన్ లో అడుగు పెట్టి, అక్కడ  పదిహేడు సంవత్సరాలు అక్కడ గడిపారు.  రైల్వే వారి జీవితం అంటే సుఖాలే కాదు ఎనెన్నో కష్టాలూ వుంటాయని ఈ పుస్తకం ద్వారా మనకి తెలిపారు.          
  ఇంత వరకూ  మంచి పుస్తకం అందించిన పొత్తూరి విజయలక్ష్మి గారి కలం నుంచి మరెన్నో పుస్తకాలు హాస్యంతో పాఠకులను నవ్వుల ఊయలలో ఓలలాడించాలి.   
పుస్తకం పేరు          :     జ్ఞాపకాల జావళి 
రచన                     :     పొత్తూరి విజయ లక్ష్మి 
వెల                        :     150/- రూ.
ప్రచురణ                :      రిషిక పబ్లికేషన్స్ 
పుస్తకం దొరకు చోటు :    అన్ని ప్రముఖ విక్రయ కేంద్రాలు,
                                      శ్రీ రిషిక పబ్లికేషన్స్ 
e-mail                      :      pvlakshmi8@gmail.com 
Ph. No.                    :      040 - 2763 7729