7, మార్చి 2015, శనివారం

ఛెస్ ప్లేయర్ - రమాదేవి


అంతర్జాతీయ మహిళా దినోత్సవం

కాలెండర్ లో ఒక రోజు మహిళలకే ప్రత్యేకం కేటాయించారు. అదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రపంచం అంతా వేడుకగా జరుపుకునే ఈ రోజున అన్ని చానెల్స్, పేపర్స్, ఈవెంట్స్ చర్చలు దేశ  విదేశాలు అంతటా మహిళల గురించే! చిన్నారుల నుంచి పెద్ద పెద్ద అవార్డు గ్రహీతల  మహిళల వక్తిత్వాలు, అవార్డులు, పతకాలు, సాధించిన విజయాలు ...  మహిళా  హక్కులు, పోరాటాలు, చీకటిలో మగ్గి పోయే మహిళలు బాధిత మహిళలు, హింసకు గురయ్యే  మహిళలు , మట్టిలో మాణిక్యాలు....  ఇలా ఎందరో మహిళల గురించి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తెలుసుకుంటుంటాం.     
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చెస్ ఆటలో దాదాపు 50 సంవత్సరాల నుంచి రాణిస్తున్న 70 వసంతాల పి. రమాదేవి గారి గురించి చెప్పదలుచు కున్నాను.
మనదేశంలో అతి ప్రాచీన క్రీడ అయిన చదరంగం ఆటని ఎక్కువ ప్రాచుర్యంలోకి తెచ్చి అంతర్జాతీయం ఖ్యాతి తెచ్చిఇదు సార్లు ప్రపంచ ఛెస్ ఛాంపియన్ గా నిలిచిన మన భారతదేశ వీరుడు విశ్వనాథన్ ఆనంద్, అంతర్జాతీయ మహిళా క్రీడాకారులు మన తెలుగు వారు అయిన  కోనేరు హంపీ, ద్రోణవల్లి హారిక వున్నారు. చెస్ ఆటలో నేను సైతం అంటూ మహిళలు కూడా తమ ప్రతిభని నిరూపిస్తున్నారు.       
ఒక సాధారణ మహిళ తనకు ఆటపై గల ఆసక్తిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు టోర్నమెంట్ లలో పాల్గొంటున్నారు. తన మెదడుకి పని చెబుతూ విజయాలు సాధిస్తున్నారు. పెద్ద పెద్ద పతకాలు కొలమానం కాదు. పెద్ద పెద్ద టోర్నమెంట్స్ లో పాల్గొనటం కుడావిశేషమే!
         ఛెస్ క్రీడాకారిణి పి  రమాదేవి
       మనసులో ఉత్సాహం ఉంటే వయసు అడ్డం కాదు అని నిరూపిస్తున్నారు పోకల రమాదేవి. ఏడు పదుల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా చదరంగం ఆటని ఆడుతున్నారు. ‘ఛెస్ ఆటలో ఉంటే అన్నీ మర్చిపోగలుగుతాం. మైండ్ కూడా ప్రశాంతంగా వుంటుంది’  అని అంటారు.
    రమాదేవి తన పిల్లల ప్రోత్సాహంతో ఛెస్ ఆటపై ఆసక్తి పెంచుకున్నారు. 1970, 90 లలో వారు ఎక్కువగా అనేక చదరంగ పోటీలలో పాల్గొనేవారు. నేషనల్ బి లోఉమెన్ ఛెస్ ప్లేయర్ గా ఎన్నో టోర్నమెంట్లలో పాల్గొన్నారు. ఢిల్లి, నాగపూర్, ముంబై, కలకత్తా, అమృత్ సర్, కోయంబత్తూర్,  సేలం, చెన్నై, మొదలైన నగరాలలో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ తరఫునించి పాల్గొన్నారు. ఇప్పటికీ  ఓపెన్ టోర్నమెంట్ లలోనూ పాల్గొంటున్నారు.   ఎన్నో మెమెంటోలు, నగదు బహుమతులు అందుకున్నారు. 2006లో హైదరాబాదులో జరిగిన నేషనల్స్ లో కూడా ఆడారు. నేషనల్స్ ఆడాలంటే ముందుగా సెలక్షన్ టోర్నమెంట్ లో గెలవాలి. అప్పుడే మెయిన్ నేషనల్ గేమ్స్ లో ఆడే అర్హత వస్తుంది.      రమాదేవిగారికి 1963లో పి.యస్. రావుగారితో వివాహం జరిగింది. ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. పిల్లలందరూ అమెరికాలో స్థిరపడ్డారు.  
       వీరు పికిల్ ఇండస్ట్రీని స్థాపించి దాదాపు 20 సంవత్సరాలు విజయవంతంగా నడిపించారు. అటు  తన కాటేజ్ ఇండస్ట్రీని నడుపుతూనే ఎక్కడ ఛెస్ గేమ్స్ జరిగినా పాల్గొనేవారు. తరువాత కొంతకాలం ఆటలకి విరామం ఇచ్చారు. ఛెస్ ఆట మీద ఎంత ఆసక్తి అంటే 2011లో మైల్డ్ అటాక్ వచ్చింది. అయినా 4వ రోజు వచ్చి ఛెస్ టోర్నమెంట్స్ లో పాల్గొన్నారు.. రెండు సార్లు మైల్డ్ హార్ట్ ఎటాక్ వచ్చింది. అయినా మనోధైర్యంతో, మనో సంకల్పంతో  తిరిగి ఛెస్ టోర్నమెంట్లలో పాల్గొంటున్నారు.
"ఛెస్ ఆట లో ఎదుటి వాళ్ళు ఆడే ఎత్తులని బట్టి మనం  ఆడాలి. ఆటలో ఎత్తుకి పై ఎత్తు వేయాలి. ప్రత్యర్థి వేసే ఎత్తుకి ఎటువంటి అటాక్ వస్తుందో కొన్ని మూవ్ లు ముందుగానే ఆలోచించి ఎత్తులు వేయాల్సి వుంటుంది. ఛెస్ ఆడుతుంటే ఆట ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఆడే వారు కూడా పెరిగారు. పిల్లలలో ఛెస్ ఆట వల్ల ఆసక్తి  పెరిగింది. తల్లిదండ్ర్రులు కూడా ఛెస్ ఆటలో తమ పిల్లలని ప్రోత్సహిస్తున్నారు" అని అంటున్నారు.


   "ఆనాటి ఛెస్ ఆటలకి ఇప్పుడు ఆడే దానికి బాగా మారిపోయింది. నేడు ఎన్నో అవకాశాలు వున్నాయి. ఆట వేగం పెరిగింది. అంటే 1నిముషం నుంచి 15, 20  నిముషాలు ఇలా సమయం పెంచుకుంటూ ఇంటర్నెట్ లో చెస్ గేమ్స్ అడచ్చు. ఇంకా ఇంటర్నెట్ లలో దేశంలోని ఏ చదరంగపు ఆటగాళ్ళతో నయినా  ఇంట్లోనే కూర్చుని ఆడచ్చు. నేర్పించే గురువులు పెరిగారు. చెస్ ఆడుతుంటే  స్టెడీనెస్, ఏకాగ్రత పెరుగుతుంది. అమ్మాయిలు కుడా ఈ ఆట అంటే ఆసక్తి చూపిస్తున్నారు. మూడు నాలుగేళ్ల వయసు నుంచే తమ పిల్లలకి నేర్పిస్తున్నారు తల్లి తండ్రులు" అని అంటారు రమాదేవి.   మనసుకి వయసు, గెలుపు ఓటమిలు ప్రధానం కాదు. ఆడాలనే ఆసక్తి ఉంటే ముందుకి వెళ్ళచ్చు అని నిరూపిస్తున్నారు రమాదేవి.