గత యాభై సంవత్సారాల నుంచి సాహిత్య కృషి చేస్తున్న అంధ్రా పెరల్ బక్ డా. వాసిరెడ్డి సీతాదేవి గారితో ఒక వెబ్ సైట్ కోసం తీసుకున్న ఇంటర్వ్యూ....
( ఈ ఇంటర్ వ్యూ 2000 సంవత్సరం లో తీసుకున్నది)
వాసిరెడ్డి సీతాదేవి గారితో ముఖాముఖి ...
· మీరు రచనా రంగంలో తిరుగులేని రచయిత్రి. మీ సాహిత్య రంగ ప్రవేశం ఎప్పుడు జరిగింది? తోలి రచన ఏది?
రచయితల్ని చాలామంది ఇదే ప్రశ్న అడుగుతుంటారు. సమాధానం కూడా వెంటనే చెప్తారు. కాని నా విషయంలో నా తొలి రచన ఎప్పుడు చేసానో నాకే తెలియదు. ఏడేళ్ళ వయసు లేక ఇంకా ముందే చేసి వుంటాను. అతిశయోక్తి కాదు. నా చుట్టూ వున్న జీవితం గురించిన ప్రశ్నలు... సమాధానంలేని ప్రశ్నలు... ప్రశ్నల నించీ ప్రశ్నలు... నా మనసే కాగితంగా, నా ఆలోచనలే కలంగా రాసాను. నా ఆలోచనలకి అక్షర రూపం కల్పించి పుస్తక రూపంలో అచ్చయిన తోలి రచన మాత్రం 1950 లో “జీవితం అంటే” అనే శీర్షిక కింద వెలువడింది. తొలి కధ “సాంబయ్య పెళ్ళి” 1952 లో రాసాను.
· మీ విద్యాబ్యాసం గురించిన వివరాలు......
నా చదువు గురించి చెబితే పెద్ద కధే అవుతుంది. మా వూరు చేబ్రోలులో 5 వ తరగతి వరకు చదువు కున్నాను. మా ఊళ్ళో పరదా పద్ధతి వుండేది. 10 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలు చదవ కూడదని నిషేధం వుంది. నాకు చదవాలనే కోరిక, పట్టుదల పరీక్ష రాయాలంటే రోడ్డుదాటి వెళ్ళాలి. దానికి ఒప్పుకునే వారు కాదు. మేము చదువుకున్న ఇంట్లోనే పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసి హిందీ పరీక్షలు రాసాను. మా ఊర్లోనే విశారద పాసయ్యాను. ఆ తరువాత మద్రాసు నగరం చేరి హిందీ ప్రచార సభ వారి పరీక్షలు అన్నీ పాసయి ప్రవీణ, ప్రచారక్ చేసాను. ప్రైవేటుగా నాగపూర్ యునివర్సిటిలో బి.ఏ. ఎం.ఏ. చదివాను.
· మీరు రెండు సార్లు డాక్టరేట్ అందుకున్నారు కదా. అవి అందుకుంటున్నపుడు మీ ఫీలింగ్స్ మాతో కూడా పంచుకోండి …..
నేను పొందిన అన్ని అవార్డుల కంటే కూడా ఎంతో సంతోషించాను. ఎందుకంటే నేను కాలేజీలో చదవలేదు. యూనివర్సిటీ మొహం చూడలేదు. అలాంటి నాకు ఒకే సంవత్సరం 1989 లో రెండు విశ్వవిద్యాలయాలు నన్ను గౌరవించి డి.లిట్. పట్టాలు ఇచ్చాయి. శ్రీ పద్మావతీ మహిళా యూనివర్సిటి వారు, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు ఆరునెలల వ్యవధిలో డాక్టరేట్ బిరుడునిచ్చాయి. ఇది నాకు చాలా అనందాన్నిచ్చింది.. జీవితంలో కొంత సాధించానని అనిపించింది.
· మీ రచనలు సమాజానికి దగ్గరగా నిజ జీవితానికి ప్రతిబింబంగా వుంటాయి. ఇలా రాయటానికి మీకు ప్రేరణ ఏమిటి?
చుట్టూ వున్న జీవితాల నుంచి, వాస్తవ ఘటనల్ని బట్టి కధలు అల్లుతాను.
· మీరు రచనలు చేస్తున్నపుడు కదా వస్తువుని ఎలా ఎంచుకుంటారు. దీనికి ప్రత్యేకమైన విధానాన్ని మీరు అవలంబిస్తారా?
కథ ఎంచుకునే విధానం రెండు రకాలుగా వుంటుంది. జరిగింది చూసి స్పందించి చుట్టూ వున్న సంఘటనలు ఉన్నది ఉన్నట్లుగా రాస్తే అది ఫోటోగ్రఫి అవుతుంది. దానికి కల్పనని జోడించి వాస్తవానికి దగ్గరగా రాస్తే అది క్రియేటివిటీ అవుతుంది. వ్యవస్థని గాని, సమాజంలోని సమస్యలు గాని ఇలా వుండ కుండా మరోలా వుంటే బాగుంటుందని అనుకున్నపుడు ఈ వ్యవస్థలోని లోపాన్ని తీసుకుని కధ గాని నవల గాని అల్లుతాను. పాత్రలని సంఘటలని వాస్తవానికి దగ్గరగా అనుకున్న లక్ష్యం వేపు తీసుకెళ్తాను. సాహిత్యానికి ప్రయోజనం ఉందని నమ్మి రచనలు చేయటం నా లక్ష్యం. మంచి కథకి గుర్తింపు ఎప్పుడోస్తుందంటే కథ చదివిన తరువాత పది నిముషాలయినా ప్రతిపాదించిన విషయాన్ని గురించి ఆలోచించినపుడు మంచి కథ అవుతుంది.....
· రచనా వ్యాసంగాన్ని చేపట్టాలని ప్రేరణ ఎలా కలిగింది.?
సృజనాత్మకత ప్రతిభ వున్న ప్రతి వాళ్ళూ ఊహా లోకంలో విహరిస్తారని అనుకుంటాను. చిన్న తనం నించీ జీవితం ఏమిటి అనే ప్రశ్న నన్ను వేధించేది. చుట్టూ ఉన్నదే జీవితం కాదు. ఎదో వున్నది అని అనిపించేది. ఏదో చెయ్యాలి, ఎదో సాధించాలి అనే, ఒక్కోసారి ఈ జీవితం క్షణకాలం ఎందుకు ఎదో సాధించాలనే పట్టుదల అనీ అనిపించేది. ఈ ఆలోచనా సంఘర్షణలోనే నా రచనలు ప్రారంభం అయ్యాయను కుంటాను.
· “సమత” నవలకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది కదూ?
అవును. “సమత” నవలకి, ఉరితాడు నవలకి సాహిత్య అకాడమీ అవార్డులు వచ్చాయి. ఇవి కన్నడం, హిందీ భాషల్లోకి కూడా అనువదించారు.
· మరీచిక నవలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది కదా దీనిపై మీ అభిప్రాయం...?
1982 లో ఈ నవలని నిషేధించారు. అదే సంవత్సరం ఆ నిషేదాన్ని తొలగించారు. ‘మాలపల్లి’ నవల తర్వాత ప్రభుత్వంచే నిషేధించ బడిన పుస్తకం ఇదే
· రచనల ప్రభావం వ్యక్తులపై ఉంటుందంటారా?
తప్పకుండా వుంటుంది. ఆలోచింప చేసే సాహిత్యం మనిషి ఆలోచనల్ని తప్పకుండా మారుస్తుంది. “రత్తమ్మ కష్టాలు” నా కధ చదివి అప్పటి హిందీ ప్రచార సభ నిర్వాహకుని భార్య నుద్దేసించి రాసానని నన్ను ఉద్యోగం లోనించి తీసేశారు. అలాగే రాబందులు రామచిలుకలు అనే నవలలో పంచాయతీ రాజ్ వ్యవస్థలో ముఖ్య సేవికలు, గ్రామ సేవికలపై పురుషుల దౌర్జన్యం గురించి రాసాను. అది చదివి రామిరెడ్డి గారని పంచాయితీ ప్రెసిడెంట్ తమ ఉద్యోగానికి రాజేనామా చేశారు. ఒక మంచి రచన ద్వారా ఒకరు మారినా ఆ రాచయితకు అంతకన్నా అనందం మరోకటుండదు.. అలాగే మరీచిక నవల నిషేధించారు నాకు ఉద్యోగంలో రివర్షన్ జరిగింది.
· రచయిత్రిగా మీపై ఎవరి ప్రేరణ వుంది?
నా చుటూ వున్నా సమాజం పరిస్తుతులే నాకు ప్రేరణ..
· నేటి సమాజంలోని స్త్రీలకు మీరిచ్చే సలహాలు?
స్త్రీల హక్కుల కోసం, మానవ హక్కుల కోసం పోరాడే ప్రతి వాళ్ళు స్త్రీ వాదులే. స్త్రీ విముక్తి కూడా సమాజ విముక్తిలో భాగమే. స్త్రీ పురుషులిద్దరూ శ్రమైక జీవనంలో భాగస్వాములు కావాలి. స్త్రీ చైతన్య స్థాయి పెరగాలి.
స్త్రీ తన కాళ్ళపై తానూ నిలబడగలగాలి. ఎప్పుడూ ఎవరో ఒకరు అండగా నిలవాలనుకోవటం పిరికితనం. సూటిగా తన గమ్యం వేపు నడిచే వారికి ఏ అవాంతరాలు వుండవు. ధైర్యంగా నిలబడితే వెంటపడే వాళ్ళు వెన్నంటి నిలిచే వాళ్ళవుతారు. సూటిగా వెళ్తున్నపుడు ఎవరికీ భయపడాల్సిన పని లేదు. ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారని ఆలోచిస్తేనే సమస్యలు వస్తాయి. భర్తల ఆరళ్ళు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడే చదువుకున్న స్త్రీలు, ఉద్యోగినిలు కూడా వున్నారు. కొంత కాలం క్రితం ఒక లేడీ డాక్టర్ ఇద్దరు పిల్లల తల్లి, భర్త పెట్టె హింసలు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఇటువంటి వారిపై నాకు సానుభూతి కలగదు. వ్యష్టిగా సమిష్టిగా స్త్రీలు పోరాటం చేస్తున్న ఈ రోజుల్లో కూడా తాళి అనే బ్రహ్మ పదార్ధం చుట్టూ ఈ వ్యవస్థ అల్లిన భావ జాలం నుంచీ చదువుకున్న స్త్రీలు బయట పడలేక పోతున్నారంటే నాకు అంతులేని కోపం వస్తుంది. బాధలతో దద్దమ్మలా బతుకుతున్నారంటే చెంపలు వాయించి ధైర్య చెప్పాలనిపిస్తుంది.
ఆత్మ విశ్వాసంతో, ధైర్యంతో, ఒక లక్ష్యంతో ముందుకు సాగి పోయే స్త్రీని సమాజం కాని ఈ పురుషాధిక్యం కానీ ఏమీ చేయదు. చేయలేదు. అందుకు నేనే ఉదాహరణ.
· తెలుగు సాహిత్యంలో ప్రస్తుతం అనువాదకులు కూడా ఎక్కువగా వున్నారనే అభిప్రాయం వుంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
చాలామంది స్వతహాగా రాసేవారూ వున్నారు. అయినా అనువాదకులు ఇంకా రావాలి. ఇతర భాషల్లో ఆయా రచయితలూ రాసింది ప్రపంచమంతా అందరికీ తెలియాలంటే తప్పకుండా వుండాలి. అప్పుడే మహా మహా రచయితలు రాసింది రచయితల భావాలు అందరికీ తెలిసే వీలుంటుంది.
· మీ రచనలు ఇంతవరకు ఏఏ సినిమాలుగా వచ్చాయి? టి.వి. సీరియల్స్ వచ్చాయి?
‘సమత’ నవల ‘ప్రజానాయకుడి’గా, ‘ప్రతీకారం’ ‘మనస్సాక్షి’గా, ‘మానిని మనసు’ – ‘ఆమె కధ’గా ‘మృగతృష్ట’ అదే పేరుతోనూ వచ్చాయి. ఆమె కధ ఎన్నో అవార్డులు తెచ్చుకుంది.
“నా నవలలు ఇదీ కధ, నిశాగీతం కలిసి ప్రస్తుతం మానస అనే టివి సీరియల్ దూరదర్శన్ లో వస్తోంది. ఇది ఒక సైకలాజికల్ ప్రోబ్లమ్స్ ఆధార పది వున్న సీరియల్. సామాన్యంగా మనకి భౌతిక పరమైన సమస్యలు వస్తే డాక్టరు దగ్గరికి వెళ్తాం. కాని మానసికంగా సమస్య వస్తే డాక్టరు దగ్గరికి వెళ్ళటానికి భయపడం. అదే అమెరకా నంటి దేశాల్లో కొంచెం అనారోగ్యంగా కన్పించినా సైక్రియాట్రిస్ట్ దగ్గరకి వెళ్ళటం, కౌన్సిలింగ్ కి వెళ్ళటం చేస్తుంటారు. ఇక్కడి వాళ్ళు వెళ్లరు. నేను సొంతంగా చాలా సైకలాజికల్ కేసులు డీల్ చేసాను. నా స్నేహితురాలు మంచి సైక్రియాట్రిస్ట్. రోజూ ఆమె దగ్గరికి వెళ్లి ఆమె దగ్గరికి వచ్చే కేసులు గమనించే దాన్ని. “మళ్ళీ తెల్లవారింది” సీరియల్ కి ఉత్తమ రచయిత్రిగా నంది అవార్డు 1998లో వచ్చింది.
· నేటి టి.వి. కార్యక్రమాలపై సినిమాలపై మీ అభిప్రాయం?
నేటి సినిమాలు చూడ్డం లేదు. టివి సీరియల్స్ రొటీన్గా వుంటున్నాయి. ఒకటి రెండు సంవత్సరాలు లాగుతూ ఎం చెప్పదలచుకున్నారో తెలీకుండా తీస్తున్నారు. సీరియల్స్ అయిపోతున్న తరుణంలో ఎక్స్టెన్షన్ అవుతున్నాయి. ఎందుకిస్తున్నారో తెలీదు. దుష్ట పాత్రలు ఎక్కువైనాయి. క్రూరమైన ఆడవాళ్ళు, వెన్నుముక లేకుండా భోరున ఏడ్చే ఆడవాళ్ళని చూపిస్తున్నారు. సహజ పాత్రలు వుండటంలేదు. డైలీ సీరియల్స్ 60 నెలల కంటే ఎక్కువ కాలం వుంటున్నాయి.
· మీరు సామాజిక స్పృహ కలిగిన రచనలు ఎక్కువ చేసారు. దీనికి కారణం ఏదైనా వుందా?
నా ఆవేశాలకి, ఆలోచనలకి వేదికగా నవల ప్రక్రియనెన్నుకున్నాను.
వాస్తవాన్ని ఇష్టపడే నేను ప్రేమకధలకు, కల్పనా సాహిత్యానికీ ముందు నించి దూరం. ఎప్పుడూ కల్పనా లోకంలో విహరించ లేదు. నాకు సామాన్య జీవితమే నవలా ఇతివృత్త మైంది. సాహిత్యం తపస్సులాటిది. సమాజంలో ఒక మనిషిని ఒక అడుగు ముందుకు నడిపించినా రచయిత జీవితం ధన్యమైనట్లే! రచనలు పాఠ కులలో ఆలోచనలు రేకెత్తించాలి. మనుషులు మారారంటే భావాలు మారినట్లే. మారిన మనుషులు సమాజంలోని అవక తవకల్ని నిర్మూలించి సమాజాన్ని సమ సమాజం వైపు నడిపించడానికి ప్రయత్నిస్తారు .
· రచయితగానే కాకుండా సెన్సారు బోర్డు మెంబరుగా మీ అనుభవాలు ఏమిటి?
చాలా అనుభవాలున్నాయి. అన్నీ చెబితే పెద్ద గ్రంధమవుతుంది. నేను వెళ్తున్నానంటే భయపడేవారు. ఆ రోజుల్లో నా సహా కమిటీ మెంబర్లు కూడా పెద్ద వాళ్ళే వున్నారు. డి.జి.పి లేటు నారాయణరావుగారు మొదలైన వాళ్ళు ఉన్నారు. అందరం స్త్రిక్ట్ గా కమిటి పరిశీలనకి వచ్చిన చిత్రాలు చూసేవాళ్ళం. రూల్స్ ఖచ్చితంగా పాటించే వాళ్ళం. తోలి సెన్సారు బోర్డు మాదే! నేను 1985 నుంచి 1991 వరకూ బోర్డు మెంబరుగా వున్నాను.
· నూతన రచయితలకి మీరిచ్చే సలహాలు సూచనలు.
రచయితలు తెలిసిన విషయాలనే రాయాలి. అభూత కల్పనలు రాయకూడదు. లక్ష్యం లేని రచనలు చేయద్దు. మంచి సాహిత్యం చదివి రాయాలి. చెడు సాహిత్యం మాత్రం చేయకూడదు. మంచి కన్నా చెడు ప్రభావం ఎక్కువ వుంటుంది. యువత కెరీర్ ఓరియెంటెడ్ అయిపోయి పుస్తకాలకి దూరం అవుతున్నారు. ఒక గంట అయినా పుస్తకాలు చదవాలి. వ్యక్తి తన దైనందిన జీవితానికి దూరం అవుతున్నాడు. నేటి స్త్రీలలో ఆత్మా విశ్వాసం లోపిస్తోంది. తల్లి తండ్రి కష్టపడి చదివించినా... లాయర్లు, డాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. స్త్రీలు తమ ఇండివిడ్యుయాలిటి పెంచుకోవాలి.
· ప్రస్తుత మీ రచనలు వాటి గురించి....
కేంద్ర ప్రభుత్వం వారి హ్యూమన్ రిసోర్స్ సీనియర్ ఫెల్లోషిప్ రెండు సంవత్సరాల కాల పరిధిలో చేస్తున్నాను. ఒక నవలని స్త్రీ విముక్తి అనే పేరుతొ రాస్తున్నాను. స్త్రీల హక్కులు, స్త్రీ స్వాతంత్ర్యం గురించి ఇందులో వివరిస్తున్నాను. ...
( ఈ ఇంటర్ వ్యూ 2000) సంవత్సరం లో తీసుకున్నప్పటిది
(She Died – 2007)